ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లీజు విషయంలో వేల కోట్ల దోపీడీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్:లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారంనాడు సాయంత్రం హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ వివరణ సంతృప్తి కరంగా లేదన్నారు. ఈ విషయమై కేటీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. ఔటర్ రోడ్డులో వేల కోట్ల దోపీడీ జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్క రూపాయి కూడా రుణ భారం లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును ఎందుకు ప్రైవేట్ వారికి లీజుకు ఇచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం ఏ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్ని విక్రయిస్తుందో కేసీఆర్ సర్కార్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆరు వేల ఎకరాల్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు భూమి విలువ రూ. 65 వేల కోట్లు అని రేవంత్ రెడ్డి చెప్పారు.
రూ. 7వేల కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డును ఎందుకు లీజుకు ఇచ్చారని రేవంత్ రెడ్డి అడిగారు. బేస్ ప్రైజ్ తాము చెప్పలేమని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. టెండర్ పూర్తయ్యాక ఈ వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ విషయంలో తాను అడిగిన సమాచారం ఇవ్వడానికి కూడ మున్సిపల్ శాఖ సిద్దంగా లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు సమాధానం చెప్పకపోయినా సీబీఐ, ఈడీకి అరవింద్ కుమార్ సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. గతంలో ఇదే తరహలో వ్యవహరించిన బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి వంటి అధికారులకు ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేట్ సంస్థకు లీజ్ విషయమై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీఓపీటీకి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు కాగ్ కు కూడా ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
also read:నిబంధనల ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్లు: మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్
ఔటర్ రింగ్ రోడ్డు లీజును 15 నుండి 20 ఏళ్ల లీజు కు ఇవ్వాలని ఎన్‌హెచ్ఏఐ సూచించిందన్నారు. మరో వైపు 30 ఏళ్ల పాటు లీజు ఇవ్వడాన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తప్పుబట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు.