
హైదరాబాద్: గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తూనే పాటించాల్సిన సంప్రదాయాలను విస్మరించరాదని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారంనాడు టీపీసీసీ చీప్ Revanth Reddy గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వ్యక్తులతో సంబంధాలు లేకుండా వ్యవస్థలను, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై తమ పార్టీ ముందుంటుందన్నారు.
గవర్నర్ తల్లి చనిపోయిన సమయంలో గవర్నర్ ను సీఎం KCR పరామర్శించకపోవడం సరైంది కాదన్నారు. అంతేకాదు తమిళిసై సౌందర రాజన్ తల్లి చనిపోయిన సమయంలో ఆమె మృతదేహన్ని స్వగ్రామం తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు.
కేసీఆర్ స్వంతంగా ఈ విమాన ఖర్చులు భరించాలని చెప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంత బాధ్యతారాహిత్యంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తారనుకోలేదన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటే Telangana గౌరవం పెరుగుతుందన్నారు.తెలంగాణ ప్రజల మంచితనాన్ని అలుసుగా తీసుకొని కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఇది గవర్నర్ Tamilisai Soundararajan కేసీఆర్ వ్యక్తిగత సమస్య కాదన్నారు. గవర్నర్, సీఎం వ్యవస్థకు మద్య ఉండే సత్సంబంధాలు, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సంప్రదాయాలను పాటించకపోతే ఖండించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.
గవర్నర్ చేసే ప్రతి చర్యను తాము సమర్ధించడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అయితే గవర్నర్, సీఎం వ్యవస్థల మధ్య ఉన్న సంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో TRS బీజేపీకి అనుకూలంగా ఓటేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Ramnath Kovind బీజేపీ ఎస్‌సీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ తమిళిసై సౌందర రాజన్ బీజేపీ నాయకురాలిగా పనిచేసిన విషయం టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదన్నారు.
ఉగాది వేడుకలకు తాను ఆహ్వానిస్తే కేసీఆర్ సహా మంత్రివర్గ సహచరులు హాజరు కాని విషయమై గవర్నర్ మీడియాతో చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే అదే సమయంలో హైద్రాబాద్ లోనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉగాది వేడుకలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే బాగుండేదన్నారు.