
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాతోనే వచ్చిన ఈ ఉపఎన్నికలో పార్టీ సీటును నిలబెట్టుకోలేకపోయింది. సరికదా.. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ దారుణ పరాభవం.. అదీ రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉండగానే జరిగిన ఎన్నికలో ఓటమి పార్టీకి ఎదురుదెబ్బనే. ఇప్పటికే పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ పార్టీ మరో అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పరాజయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు.
రాజకీయాల్లో గెలుపోటములు అన్నవి సహజమని ఆయన ఓటమిని హుందాగా అంగీకరించారు. అయితే, ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మునుగోడులో ప్రలోభాలు జరిగాయని, వాటికి లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Also Read: అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 97006 ఓట్లు సాధించి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,897 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,906 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.