అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?

By Mahesh KFirst Published Nov 7, 2022, 8:35 AM IST
Highlights

మహారాష్ట్రలోని ఈస్ట్ అంధేరీలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం అభ్యర్థి రుతుజ లట్కే ముందే ఊహించినట్టు గెలుపొందారు. కాగా, రెండో స్థానంలో నోటా నిలవడం మాత్రం ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో కేఏ పాల్ 805 సాధించారు.
 

హైదరాబాద్: ఉపఎన్నిక ఫలితాలతో నిన్న ఆరు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, బిహార్‌లో రిజల్ట్స్ పై ఉత్కంఠ నెలకొంది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల ఫలితాలపై చివరి వరకు ఆసక్తి నెలకొంది. చివరకు తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో ఆర్జేడీ, బీజేపీ చెరో సీట్లు గెలుచుకున్నాయి. కాగా, మహారాష్ట్రలో ఈస్ట్ అంధేరీ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఆసక్తికరంగా మారింది. ఈస్ట్ అంధేరీలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన గెలుపొందగా.. నోటా రెండో స్థానంలో నిలవడం ఆసక్తికరంగా మారింది.

శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించడంతో ఆయన భార్య రుతుజ లట్కే బరిలో దిగారు. ఆమె పై పోటీగా బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థికే మద్దతు తెలిపారు. దీంతో రుతుజ లట్కేకు పోటే లేకుండా పోయింది.

ఈస్ట్ అంధేరిలో మొత్తం 86,570 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రుతుజ లట్కే 66,530 ఓట్లు సాధించింది. ఆ తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. నోటాకు ఏకంగా 12,806 ఓట్లు వచ్చాయి. అంటే 14.79 శాతం ఓట్లు నోటాకే పడ్డాయి. కాగా, ఇతరులకు 1600కు మించి ఓట్లు రాలేవు.

Also Read: రాజగోపాల్ రెడ్డి హీరో.. ఒక్క బీజేపీ కోసం ఇంతమందా, టీఆర్ఎస్‌ది ఓ గెలుపేనా : బండి సంజయ్ వ్యాఖ్యలు

కాగా, తెలంగాణలోనూ మునుగోడు ఉపఎన్నిక బరి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీగా సాగింది. కానీ, స్వతంత్రంగా పోటీ చేసిన శాంతికపోతం కేఏ పాల్ ప్రచారం ఆసాంతం వీటన్నింటికి భిన్నంగా సాగింది. మొదటి నుంచి ఆయన ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఆయన మాటలు, చేతలు చాలా మందిలో కేఏపాల్‌ను గుర్తుంచుకునేలా చేశాయి. అందుకే నిన్నటి ఫలితాల్లో గెలుపెవరిది అనేది ఎంత ఆసక్తికరంగా మారిందో.. కేఏపాల్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయి అనే విషయం కూడా అంతే ఆసక్తికరంగా మారింది. అయితే, నోటా కంటే ఎక్కువ స్థానాలనే కేఏ పాల్ గెలుచుకున్నారు.

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 97006 ఓట్లు సాధించి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,897 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,906 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా, ఈ ఉపఎన్నికలో నోటాకు 482 ఓట్లు పడ్డాయి. కేఏ పాల్‌కు ఇంత కంటే దాదాపు రెట్టింపు ఓట్లు పడ్డాయి. 805 ఓట్లను ఆయన సాధించుకుని మొత్తంలో ఓట్లలో 0.36 శాతం ఓట్లను పొందారు.

click me!