ఓఆర్ఆర్ రోడ్డు కాంట్రాక్టు విషయమై మున్సిపల్ కార్యాలయంలో ఆర్టీఐ కింద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధరఖాస్తు చేశారు.
హైదరాబాద్:ఓఆర్ఆర్ లో అవినీతి బయటపడుతుందనే తనను అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారంనాడు హైద్రాబాద్ మాసబ్ ట్యాంక్ లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన సమాచారం కావాలని రేవంత్ రెడ్డి ఆర్‌టీఐ కింద సమాచారం కోరారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ ను కేసీఆర్, కేటీఆర్ తెగనమ్ముకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని ఆయన అప్రజాస్వామికమన్నారు. తాను ఒక్కడినే సచివాలయంలోకి వెళ్తానని చెప్పినా కూడా పోలీసులు వినలేదన్నారు. పోలీస్ వాహనంలోనే తీసుకెళ్లాలని కోరినా కూడా పట్టించుకోలేదన్నారు.
ఆర్‌టీఐ కింద రేవంత్ రెడ్డి ధరఖాస్తు
ఓఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఓ ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్లు కట్టబెట్టడంపై మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఆర్టీఐ కింద రేవంత్ రెడ్డి ధరఖాస్తు చేశారు. ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి సమాచారం కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ కు ఆర్ టీ ఐ కింద ధరఖాస్తును రేవంత్ రెడ్డి అందించారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇచ్చిన టెండర్ల వివరాలను రేవంత్ రెడ్డి కోరారు. టెండర్ లో పాల్గొన్న కంపెనీలు, అర్హత సాధించిన కంపెనీలు వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
అంతకుముందు ఇదే విషయమై తెలంగాణ సచివాలయంలో ఆర్టీఐ కింద ధరఖాస్తు చేసేందుకు వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసలుు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అందుబాటులో లేడని పోలీసులు రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. మాసబ్ ట్యాంక్ లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి రేవంత్ రెడ్డిని తీసుకెళ్లారు పోలీసులు. మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం లో రేవంత్ రెడ్డి ఆర్‌టీఐ కింద ధరఖాస్తు అందించారు.