పారిశుద్య కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మేడే కానుక అందించారు. వెయ్యి రూపాయాల వేతనం పెంచారు. మరో వైపు ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్: పారిశుద్య కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మే డే కానుక అందించారు. పారిశుద్య కార్మికులకు వెయ్యి రూపాయాలు వేతనం పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల్లో పనిచేసే పారిశుద్య కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని 1,06,474 మంది పారిశుద్య కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి.
పెరిగిన వేతనాలు తక్షణమే అమలు లోకి వస్తాయని సిఎం ప్రకటించారు. పారిశుధ్ద్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పారిశుద్య కార్మికుల సంక్షేమానికి, అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం వివరించారు.
రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక పారిశుద్య కార్మికుల కృషి దాగి ఉన్నదని సీఎం ప్రస్తావించారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని సీఎం గుర్తు చేశారు. .రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్య కార్మికుల జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పారిశుధ్ద్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తున్నారన్నారు.
.
ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచాలని కేసీఆర్ ఆదేశం
ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.