కాంగ్రెస్‌కి హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్.. మరీ మంచిదంటూ రేవంత్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 26, 2022, 05:47 PM IST
కాంగ్రెస్‌కి హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్.. మరీ మంచిదంటూ రేవంత్ వ్యాఖ్యలు

సారాంశం

తాను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చిచెప్పడంతో దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్ వస్తే మంచిదేనని... రాకపోతే మరి మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌లో (congress) చేరేది లేదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. ఏ పార్టీలోనైనా చేరేది, చేరనది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. పార్టీలో పీకే చేరే అంశానికి సంబందించి హైకమాండ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తన దృష్టికి వస్తే తప్పకుండా స్పందిస్తానని ఆయన చెప్పారు. పార్టీలో చేరితే నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి అరాచకవాదికి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మద్ధతు పలకడం తెలంగాణ ప్రజలకు మంచిది కాదన్నారు. వ్యక్తిగతంగా ప్రశాంత్ కిషోర్‌కు తనకు ఎలాంటి వివాదాలు లేవని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌తో ఎవరు జట్టుకట్టినా మేం వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం  చేశారు. కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్ వస్తే మంచిదేనని... రాకపోతే మరి మంచిదని రేవంత్ వ్యాఖ్యానించారు. 

కాగా.. గత కొద్ది రోజులుగా ఎన్నికల వుహకర్త ప్రశాంత్‌ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడా..? లేదా..? అనే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ (aicc) జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా (randeep surjewala) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పార్టీలో చేరాల్సిందిగా పీకేను సోనియా గాందీ ఆహ్వానించారని.. అయితే ప్రశాంత్ కిషోర్ దానిని తిరస్కరించారని చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనలను తాము అభినందిస్తున్నట్టుగా చెప్పారు. 

‘‘ప్రశాంత్ కిషోర్‌ ప్రెజెంటేషన్, చర్చల తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్వచించిన బాధ్యతతో గ్రూప్‌లో భాగంగా పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అయితే ఆయన నిరాకరించారు. ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనలను మేము అభినందిస్తున్నాము’’ అని సుర్జేవాలా పేర్కొన్నారు.  

ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా ధ్రువీకరించారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్‌లో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తనకంటే.. సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. సంస్కరణల ద్వారా పార్టీలో క్షేత్ర స్థాయిలో నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి.. కాంగ్రెస్‌కు తన కన్నా నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం ఉందని భావిస్తున్నట్టుగా చెప్పారు. 

ఇకపోతే.. ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులుగా సోనియా గాంధీతో (sonia gandhi) పాటు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. 2024 ఎన్నికల కోసం పలు ప్రాతిపాదనలపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ చేసిన సిఫార్సులపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ.. ఎనిమిది మంది సభ్యలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు ముందు ఎదురయ్యే రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి, సంస్థాగత సమగ్రతను చర్చించడానికి సాధికారత కమిటీని  ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే కొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ కిషోర్ రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టుగా స్వయంగా పీకేనే ప్రకటన చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?