
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంగళవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ములుగు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే రాష్ట్రం ఇవాళ దొంగలపాలైందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కల్పించడం కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:మూసీలో ముంచి కేటీఆర్ కు సన్మానం చేయాలని ఉంది.. రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేదని.. ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో వారికి విలువ లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా రావడంలేదని.. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్థానిక నేతలు రోడ్డున పడ్డారని సర్పంచ్, ఎంపీటీసీలమని చెప్పుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారని.. స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంగా బతకాలంటే టీఆర్ఎస్ పోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి గౌరవం దక్కుతుందని.. తెలంగాణ అమరులకు, రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనకు పీసీసీ పదవి వస్తుందని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే .. ప్రగతి భవన్ తలుపులు తెరచుకున్నాయంటూ ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ తల్లిని బందీ నుంచి విడదీయడానికే సోనియగాంధీ నాకు పీసీసీ ఇచ్చిందని... తనకు పదవులపై ఆశలేదని రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందన్నారు.