శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించని కేసీఆర్ మిమ్మల్ని గుర్తిస్తాడా..?: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై విజయశాంతి

By Nagaraju penumalaFirst Published Oct 14, 2019, 1:31 PM IST
Highlights


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 
 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కేసీఆర్ కి వెన్నతోపెట్టిన విద్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై ఆమె స్పందించారు. బలిదానాలతో ఏమీ సాధించలేమని స్పష్టం చేశారు. ధైర్యంగా కేసీఆర్ నియంత పాలనను ఎదుర్కొనాలిని సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 

ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమన్నారు. ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్ గారికి బాగా తెలిసిన విద్య అని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను చూసి చలించే తత్వం కేసీఆర్ దొరకు లేదని ఇది పలు సందర్భాల్లో రుజువైందన్నారు. ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే మంచిదన్నారు. ఫలితంగా దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చునని సూచించారు. 

ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణత్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోందని విజయశాంతి విమర్శించారు. సమ్మె ప్రభావం లేకుండా అన్ని ప్రత్యామ్నాయ చర్యలూ తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు తిరుగుతున్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంపై ఎద్దేవా చేశారు. 
 
మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా మరో వారం రోజుల పాటూ బడులకు దసరా సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంపై సెటైర్లు వేశారు. నిజంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే, స్కూళ్లకు సెలవులు ఎందుకు పొడిగించారో వివరణ ఇవ్వాలని నిలదీశారు. 

టీఆర్ఎస్ సర్కారు వైఖరిని చూస్తుంటే మళ్లీ బస్సులు సజావుగా నడిచే వరకు పాఠశాలల సెలవులను పొడగిస్తారేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు.ఇదే జరిగితే పాఠశాలలకు దసరాకు మొదలైన సెలవులు సంక్రాతి వరకు కొనగాగుతాయేమోనంటూ సెటైర్లు వేశారు విజయశాంతి.

 

click me!