సమ్మెకి వెళ్లేముందు మాకు మాటైనా చెప్పారా: ఆర్టీసీ కార్మికులపై టీఎన్జీవో ఫైర్

By Siva KodatiFirst Published Oct 13, 2019, 1:50 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లేటప్పుడు.. ఆర్టీసీ జేఏసీ నేతలు ఎప్పుడూ తమను కలవలేదని నేతలు తెలిపారు. అయితే వారి కోసం సుమారు 2 గంటల పాటు వెయిట్ చేశామని కానీ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశానికి రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు

తమ సమ్మెకు మద్ధతు తెలపాల్సిందిగా ఆర్టీసీ జేఏసీ నేతలు.. ఆదివారం టీఎన్జీవో నేతలను కలిశారు. పలు అంశాలపై రెండు సంఘాల నేతలు చర్చలు జరిపారు. అనంతరం టీఎన్జీవో నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి టీఎన్జీవో నేతలు నివాళులర్పించారు.

ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ సంఘాలు మద్ధతు తెలపడం లేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లేటప్పుడు.. ఆర్టీసీ జేఏసీ నేతలు ఎప్పుడూ తమను కలవలేదని నేతలు తెలిపారు.

అయితే వారి కోసం సుమారు 2 గంటల పాటు వెయిట్ చేశామని కానీ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశానికి రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.. కార్మికుల సమస్యలకు సంబంధించి 16 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు.

తమతో ముందుగానే సంప్రదించి వుంటే పరిస్ధితి ఇక్కడి వరకు వచ్చేది కాదని.. పరిష్కారం అప్పుడే కనుగొనేవాళ్లమని టీఎన్టీవో నేతలు తెలిపారు. సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన నేతలే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల వెనుకున్నారని నేతలు తెలిపారు.

రాజకీయ నాయకులు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సమ్మెను ముందుకు నడిపిస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు వెల్లడించారు. తమ సర్వీస్ రూల్స్ వేరని.. ఆర్టసీ కార్మికుల సర్వీస్ రూల్స్ వేరని జేఏసీ నేతలు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం తాము ముఖ్యమంత్రిని కలిస్తే దానిపైన దుష్ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెను కొంతమంది నేతలు చెప్పుచేతల్లోకి తీసుకుని వారే నాయకత్వం వహిస్తున్నట్లుగా, కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని రవీందర్ రెడ్డి ఆరోపించారు. 
 

click me!