
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణపై తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. గట్టిగా మాట్లాడినందుకే ఈటెలపై విచారణ జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని నాంపల్లిలో గల పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఈటెల రాజేందర్ మీదనే కాకుండా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్ రెడ్డిలపై కూడా విచారణ జరగాలని ఆయన అన్నారు ప్రత్యర్థులను లొగదీసుకోవడానికి భూవివాదాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
హఫీజ్ పేట, మియాపూర్ భూములపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నుంచి దృష్టి మళ్లించడానికే ఈటెల వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈటెల రాజేందర్ మీద విచారణకు ఆదేశించారని ఆయన అన్నారు. ఈటెలపై విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన అన్నారు. కరీంనగర్ కు చెందిన మరో మంత్రిపై ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు.