చెప్పినా ఉత్తమ్, రమణ వినలేదు: ఓటమిపై కోదండరామ్

By narsimha lodeFirst Published Jan 1, 2019, 4:24 PM IST
Highlights

ఓవర్‌ కాన్పిడెన్స్ కూటమి కొంపముంచిందని టీజేఎస్ చీఫ్ ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. 


హైదరాబాద్: ఓవర్‌ కాన్పిడెన్స్ కూటమి కొంపముంచిందని టీజేఎస్ చీఫ్ ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. కూటమి తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికులు కొత్త వారు  కావడం కూడ  నష్టం  చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు  టీజేఎస్ చీఫ్  కోదండరామ్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫ్రంట్ ఓటమిపై  కోదండరామ్  కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారానికి సమయం సరిపోదని తాను చెప్పినా కూడ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారానికి 15 రోజులు  సరిపోతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, 3 వారాలు సరిపోతోందని  టీడీపీ చీఫ్ ఎల్. రమణ అభిప్రాయపడ్డారని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్ ప్రచారశైలి గురించి మీకు తెలియదని  తాను చెప్పినా కూడ కూటమిలోని పార్టీలు  పెడచెవిన పెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమిలోని పార్టీల మధ్య పొత్తుల చర్చలను ముందుగా తేలిస్తే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాన్ని కోదండరామ్ వ్యక్తం చేశారు.

పీపుల్స్ ప్రంట్ అజెండా బాగున్నా కూడ ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో  సక్సెస్ కాలేకపోయినట్టు ఆయన చెప్పారు. ఇంటింటికి  తీసుకెళ్లలేకపోయామన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమా రావడంతో  కూటమి నేతలు, అభ్యర్థులు ఎక్కువగా పెద్ద సభలతోనే సరిపెట్టారని చెప్పారు.క్షేత్రస్థాయిలో కూటమిని తీసుకెళ్లలేకపోయినట్టు చెప్పారు.

ప్రచారం ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు.మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువగా కొత్తవారే కావడం కూడ నష్టం చేసిందన్నారు. కేసీఆర్ తనపై ఉన్న వ్యతిరేకతను  చల్లార్చుకొన్నారని  కోదండరామ్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో కీలక నేతలను ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకోవాలనే విషయమై సరిగా ప్లాన్ చేసుకోలేకపోయినట్టు కోదండరామ్ ఒప్పుకొన్నారు. గద్దర్, మందకృష్ణమాదిగ లాంటి వాళ్లను రాహుల్ గాంధీ సభలకే పరిమితం చేశారని  చెప్పారు.

ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్, చంద్రబాబునాయుడు మధ్య ఏం సంబంధాలున్నాయో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తనకు రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి తనకు  అలాంటి ఆఫర్ రాలేదని ఆయన తెలిపారు.


 

click me!