ఫైన్ కట్టమన్నందుకు మహిళా టీటీఐని రైలు నుంచి తోసేసిన దుండగులు

By Nagaraju penumalaFirst Published Mar 7, 2019, 8:33 AM IST
Highlights

బుధవారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వచ్చిన రైలులో తనిఖీ చేసేందుకు ఆమె ట్రైన్ ఎక్కారు. ఆ సమయంలో స్లీపర్ క్లాస్ బోగీలో చాలా మంది జనరల్ టికెట్ తీసుకున్న వారు ప్రయాణించడం చూసిన ఆ అధికారి వారికి ఫైన్ వేశారు. జరిమానా కట్టమని అడగడంతో వారిలో కొందరు ఆమెను రైలు నుంచి బయటకు తోసేశారు. 

కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ వద్ద దారుణం చోటు చేసుకుంది. జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలోకి ఎక్కారని జరిమానా చెల్లించమన్న మహిళా ట్రావెలింగ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ను రైలులోంచి బయటకు తోసేశారు కొందరు దుండగులు. 

సికింద్రాబాద్ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన ఆ అధికారి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మహిళా ట్రావెలింగ్ టికెట్ ఇన్ స్పెక్టర్ నీలిమ కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వచ్చిన రైలులో తనిఖీ చేసేందుకు ఆమె ట్రైన్ ఎక్కారు. ఆ సమయంలో స్లీపర్ క్లాస్ బోగీలో చాలా మంది జనరల్ టికెట్ తీసుకున్న వారు ప్రయాణించడం చూసిన ఆ అధికారి వారికి ఫైన్ వేశారు. జరిమానా కట్టమని అడగడంతో వారిలో కొందరు ఆమెను రైలు నుంచి బయటకు తోసేశారు. 

దీంతో నీలిమ కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లింది. ఆ సమయంలో రైలు నిలిచిఉండటంతో పక్కనే ఉన్న ప్రయాణికులు ఆమెను పక్కకు లాగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్నరైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మహిళా అధికారి నీలిమను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా అధికారిని రైలులో నుంచి బయటకు తోసేసిన దుండగులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. 
 

click me!