వనపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. తాటిపాముల చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు.
వనపర్తి: జిల్లాలోని శ్రీరంగాపురం మండలం తాటిపాముల వీరసముద్రం చెరువులో పడి ముగ్గురు బాలికలు సోమవారంనాడు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి ఈ ముగ్గురు బాలికలు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తిరుపతమ్మ, సంధ్య, దీపికలు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఈ ముగ్గురు చెరువులో పడి మరణించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది
బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు బాలికల్లో తొలుత ఓ బాలిక ప్రమాదవశాత్తు చెరువలో పడింది. బట్టలు ఉతికే సమయంలో దీపిక అనే బాలిక చెరువులో పడింది. దీపికను కాపాడేందుకు సంధ్య ప్రయత్నించి చెరువులో పడిపోయింది. వీరిద్దరిని గమనించిన తిరుపతమ్మ కూడా చెరువులో పడిపోయింది. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా చెరువులో పడిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో చెరువులో మునిగి మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువగా నమోదౌతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. హైద్రాబాద్ యాకుత్ పురాకు చెందిన ఖైసర్, షేక్ ముస్తఫా, మహ్మద్ సోహైల్ లు సిద్దిపేట జిల్లాలోని సామలపల్లికి చేరుకున్నారు. అయితే చెరువు వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఈ ఇద్దరు చెరువులో పడిపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన మరొకరు కూడా చెరువులో మునిగిపోయాడు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన చోటు చేసుకుంది.