ఈ తల్లిదండ్రులకు దిక్కెవరు... మాయదారి రోగానికి ముగ్గురు బిడ్డలు బలి

By Arun Kumar PFirst Published Feb 21, 2021, 9:59 AM IST
Highlights

కాలేయ సంబంధిత వ్యాధి ముగ్గురు బిడ్డలను బలితీసుకున్న విషాదం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆదిలాబాద్: ఇప్పటికే ఇద్దరు బిడ్డలను బలితీసుకున్న రోగమే మూడో బిడ్డను కూడా బలితీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్‌ పట్టణంలోని వాల్మీకినగర్‌ లో చదల శ్రీనివాస్‌, పద్మ దంపతులు నివాసముంటున్నారు. శ్రీనివాస్ వ్యవసాయ శాఖ ఉద్యోగి కాగా భార్య గృహిణి. వీరికి ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు శ్వేత తొమ్మిదేళ్ల వయసులోను కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చనిపోయింది. ఆ తర్వాత మూడో సంతానమైన రాము కూడా ఇదే కాలేయ వ్యాధితో తొమ్మిదేళ్ల వయసులోనే మరణించాడు. దీంతో కుంగిపోయిన తల్లిదండ్రులు మిగిలిన ఒక్క కూతురు వైష్ణవిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 

చదువులో చురుగ్గా వుండే వైష్ణవి ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కూతురు  డాక్టర్ అయ్యి ప్రజల ప్రాణాలను కాపాడుతుందన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువకాలం నిలవలేదు. మిగిలిన ఇద్దరు బిడ్డలలాగే గతూడాది వైష్ణవికి కూడా కాలేయ సంబంధ వ్యాది వుందని తెలిసింది. దీంతో ఎలాగయినా బిడ్డను కాపాడుకోవాలని భావించిన తల్లిదండ్రులు ఇటీవలే ఆమెకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించారు. కూతురికోసం ప్రాణాలకు సైతం తెగించి తల్లి పద్మ కాలేయ దానం చేసింది.  

ఇటీవలే ఆపరేషన్ జరగ్గా డాక్టర్ల పర్యవేక్షణలో హాస్పిటల్ లో వుంటోంది వైష్ణవి. అయితే గత శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. దీంతో ఉన్న ఒక్క కూతురిని మాయదారి రోగం కబళించివేయడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.  
 

click me!