ఈ పెద్దలకు అసలు.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన ముస్లిం నేతలపై అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు

By Mahesh KFirst Published Sep 22, 2022, 3:41 PM IST
Highlights

ముస్లిం నేతలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశం కావడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వారు ముస్లిం కమ్యూనిటీలో ఉన్నత వర్గాల వారు అని, వారికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అవగాహన లేదని ఫైర్ అయ్యారు.

హైదరాబాద్: గత నెల ముస్లిం నేతలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కలిసి సమావేశమై చర్చించడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరకించారు. వారు ఉన్నత (కులీన్?) వర్గాలకు చెందినవారని, వారికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విషయాలపై అవగాహన లేదని స్పష్టం చేశారు. 

ఐదుగురు ముస్లిం నేతలు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ చాన్సిలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీలు గత నెల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశం అయ్యారు.

ఆర్ఎస్ఎస్ ఎలాంటిది? దాని భావజాలం ఏమిటి? అనేది ప్రపంచం అంతా తెలుసు అని, కానీ, వీరు మాత్రం భాగవత్ దగ్గరకు వెళతారు.. ఆయనను కలుస్తారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.  ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఈ ఉన్నత వర్గాలు ఏది చేసినా అది సత్యం అని, కానీ, తాము ప్రాథమిక హక్కుల కోసం పోరాడినా తప్పుగానే చిత్రిస్తారని వివరించారు. 

నిజానికి ఎంతో మేధస్సు ఉన్నట్టుగా భావించే ఈ ఉన్నత వర్గ ముస్లిం నేతలకు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించిన అవగాహన లేదని విమర్శలు చేశారు. వారు కంఫర్టబుల్‌గా జీవిస్తారని, ఆర్ఎస్ఎస చీఫ్‌ను కూడా వెళ్లి కలిసి వస్తారని పేర్కొన్నారు. అది వారి ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని తాను ప్రశ్నించడం లేదని అన్నారు. కానీ, తమను ప్రశ్నించే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని కలిశారు. ముస్లిం కమ్యూనిటీకి చేరువయ్యే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఉన్న మసీదులో దాదాపు గంటకు పైగా త‌లుపులు వేసుకొని వారి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వెంట సంఘ్ సీనియర్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్‌లు ఉన్నారు.

గత నెలలో కూడా భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న సామరస్య వాతావరణంపై చర్చించారు. కాగా.. మంగళవారం కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు అనేక మంది ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఉదాసిన్ ఆశ్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, పరోపకారి సయీద్ షెర్వానీ కూడా ఉన్నారని వర్గాలు వార్తా సంస్థ ‘పీటీఐ‘కి తెలిపారు.

click me!