సుద్దపూసలు కాదు.. మేకవన్నె పులులు.. చేనేత కంట్లో కారం కొట్టారు: చుండూరులో ఈటెల ఘాటు వ్యాఖ్యలు

By Mahesh K  |  First Published Oct 20, 2022, 7:59 PM IST

చుండూరులో చేనేత సభలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ ఉండాలని కేటీఆర్ కోరారని, ఇక్కడ సుద్దపూసల్లా మాట్లాడుతారని ఆరోపించారు. వార సుద్దపూసలు కాదని, మేకవన్నె పులులు అని విమర్శించారు. చేనేత సమస్యలపై పోరాడింది ఈటెల అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
 


హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక వేడి రాజుకుంది. ప్రచారం జోరు మీద సాగుతున్నది. తాజాగా, బీజేపీ నేత ఈటెల రాజేందర్ చుండూరులో చేనేత సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. చేనేత కంట్లో కారం కొట్టారని సీఎంపై ఆయన విమర్శలు చేశారు. చేనేత సమస్యలపై పోరాడింది ఈటెల అని గుర్తుంచుకోవాలని అన్నారు.

బతుకమ్మ చీరలు చేనేత కార్మికులతో చేయిస్తా అని సీఎం కేసీఆర్ అన్నాడని, కానీ, వాస్తవంలో అది లేదని ఈటెల ఆరోపించారు. చేనేత కంట్లో కారం కొట్టి సిరిసిల్లలో మరమగ్గాల ద్వారా 250 కోట్లతోటి తయారు చేయించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల పవర్‌లూమ్స్ ఉన్నాయని, అందులో సిరిసిల్లలోనే సగం ఉన్నాయని వివరించారు. సిరిసిల్ల మినహాయిస్తే రాష్ట్రంలో ఎక్కడి పవర్‌లూమ్స్‌కైనా కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. 

Latest Videos

Also Read: సిరిసిల్లలో నేత కార్మికులకు నిరంతరం పని: రాజన్న సిరిసిల్లలో కేటీఆర్

ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. ఆయన రాజీనామా కారణంగా మునుగోడుకు ఎన్నో పథకాలు వస్తున్నాయని వివరించారు. స్వయంగా ముఖ్యమంత్రే మునుగోడుకు వస్తున్నారని అన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంపై ముఖ్యమంత్రి, ఆయన సహచరులు, 80 మంది ఎమ్మెల్యేలు గొర్ల మందపై తోడేళ్లు పడ్డట్టు పడుతున్నారని విమర్శించారు. 

తెలంగాణ గడ్డ ఆత్మగౌరవం కలిగిన గడ్డ అని అన్నారు. ఈ గడ్డపై ధర్మమే గెలుస్తుందని తెలిపారు. జీఎస్టీలో చేనేతకు ఐదు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వారిలో కేటీఆర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం సుద్దపూసలాగా మాటలు చెబుతారని అన్నారు. వాళ్లు సుద్దపూసలు కాదని, మేకవన్నె పులులు అని ఆరోపించారు. 20 ఏళ్లలో చేనేత సమస్యలపై మాట్లాడింది, పోరాడింది ఈటెల రాజేందర్ అనే విషయాన్ని మరువొద్దని అన్నారు. రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు.

click me!