వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ: కేటీఆర్, భట్టీల మధ్య వివాదం

By telugu teamFirst Published Sep 21, 2019, 1:26 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కు, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు మధ్య వాగ్యుద్ధం చేసుకుంది. ఐటిఐఆర్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి యుపిఎ ప్రభుత్వం ఓ కాగితం పారేసిపోయిందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో శనివారం కాంగ్రెసు శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్కకు, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావుకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఐటీఐఆర్ పై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఇరు పక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. 

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటి రంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గత యుపిఎ ప్రభుత్వం ఐటీఐఆర్ ను మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ఎన్డీఎ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని ఆయన ప్రశ్నించారు. 

ఐటీఐఆర్ ద్వారా మొత్తం 70 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంటూ ఇప్పటికైనా కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఐటీఐఆర్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా కోరారు.

ఐటిఐఆర్ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం పక్కన పెట్టిందని భట్టి విక్రమార్కకు సమాధానమిస్తూ కేటీఆర్ చెప్పారు. యుపిఎ ప్రభుత్వం 2013లో బెంగళూర్, హైదరాబాద్ ఐటిఐఆర్ లకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కానీ యుపిఎ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

అయినా కూడా ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్ లో హైదరాబాద్ బెంగళూరును దాటేసిందని చెప్పారు. ఢిల్లీ పెద్దలు ఉద్దరిస్తారని తాము ఎదురు చూడడం లేదని అన్నారు. తమ పని తాము చేసుకుంటూ పోతామని చెప్పారు. ఐటీఐఆర్ కోసం కాంగ్రెసువాళ్లు ఏదో ఉద్ధరించినట్లు, తామేదో నాశనం చేసినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణ ఉద్యోగాల కోసమే వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఐటిఐఆర్ విషయంలో యుపిఎ ప్రభుత్వం ఓ కాగితం పారేసి పోయిందని చెప్పారు. ఇకనైనా కాంగ్రెసు పెద్దలు విమర్శలు మానాలని ఆయన సూచించారు. 

click me!