బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ లేదని ఆందోళన.. సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత

By Sumanth KanukulaFirst Published Dec 26, 2022, 3:18 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) కౌంటింగ్ కొనసాగుతోంది. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల  లెక్కింపు చేపట్టారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) కౌంటింగ్ కొనసాగుతోంది. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల  లెక్కింపు చేపట్టారు. అయితే సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెస్ ఎన్నికల కౌంటింగ్‌పై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్స్లు సీల్ లేకుండా ఉన్నాయని స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ ఏజెంట్లు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.  

సిరిసిల్లలోని సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల అధికారుల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు మొత్తం 76 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, రిలీవర్లను అనుమతిస్తున్నారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక్కో అభ్యర్థికి ఇద్దరు ఏజెంట్లు అనుమతించారు. 

సెస్‌లోని 15 డైరెక్టర్‌ పోస్టులకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెస్ ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా..  84 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో 87,130 మంది ఓటర్లు ఉండగా..  73,189 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

click me!