నేతల వరుస క్యూ: తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా?

By narsimha lodeFirst Published Aug 19, 2019, 7:01 AM IST
Highlights

టీడీపీకి చెందిన  నేతలు వరుసగా ఇతర పార్టీల్లో చేరడంతో ఆ పార్టీ శకం ముగిసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్:తెలంగాణలో టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలు ఆదివారం నాడు బీజేపీలో చేరడంతో ఇక ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. విడతల వారీగా టీడీపీ నుండి పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విజయవాడకు వెళ్లిన కాలం నుండి టీడీపీ నుండి తెలంగాణ రాష్ట్రంలో వలసలు మరింత పెరిగిపోయాయి. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి కాకుండా విజయవాడ నుండి పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో విజయవాడకు మకాం మార్చాడు. ఈ పరిణామం టీడీపీని దెబ్బతీసింది.

ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాడు. ఇక తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అప్పుడప్పుడు హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబునాయుడును కలిసేవారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానాన్ని గెలిచింది. 2018 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఒక్క ఎమ్మెల్యే మినహా ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లో చేరారు.

12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక్కరు మాత్రమే టీడీపీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో మూడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉన్న చరిత్ర ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇచ్చింది.

2018 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరారు. మరో ఎమ్మెల్యే మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్ రావులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఆదివారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.

మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్, అతని తనయుడు వీరేందర్ గౌడ్ కూడ త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి జిల్లాస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. తెలంగాణలో ఇక టీడీపీ శకం ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 

click me!