
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ వైసిపి అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ఇతర అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు... అనుచరులు, హుజూర్ నగర్ ప్రజల కోరిక మేరకు అతి త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
రాజీనామా ప్రకటన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... 2007 నుంచి తాను పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నానని, పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఇలా అవకాశాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహించిన పార్టీని వీడటం బాధగా వుందని... ఈ రోజు తనకు దుర్దినమన్నారు. తాను ఎక్కడున్నా జగన్ కు రుణపడే వుంటానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ బాధ్యతలతో పాటు జిల్లా ఇన్చార్జి, స్టీరింగ్ కమిటీ సభ్యుడి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని... తాజాగా ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని అన్నారు. జాతీయ పార్టీలో చేరి తెలంగాణ ప్రభుత్వ అరాచక పాలనపై పోరాడతానని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.