మళ్లీ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

By telugu news teamFirst Published Oct 16, 2020, 11:18 AM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.

గడిచిన మూడు రోజులు భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లన్నీ వరదలను తలపించాయి. కాస్త రెండు రోజుల నుంచి వర్షం తెరపించింది. దీంతో.. కాస్త ఊరటనిచ్చింది. అయితే.. మళ్లీ  తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వచ్చే అయిదు రోజుల్లో తొలి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.

దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకన్ ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని రాజారావు వివరించారు. ఆ తర్వాత అల్పపీడనం అక్టోబర్ 16, 17వ తేదీల్లో మహారాష్ట్ర ఆనుకుని ఉన్న తూర్పు, ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం వుందన్నారు. క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం కనిపిస్తోందని ఆయన వివరించారు.

ఇటు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీ నుండి 3.1 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలకు కారణం కానున్నది. ఇదిలా వుండగా.. అక్టోబర్ 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సంకేతాలున్నాయని రాజారావు అంఛనా వేస్తున్నారు.

click me!