చంద్రబాబుకు లేఖ: రమణకు సొంత పార్టీ నేతల నుంచే సెగ

By telugu teamFirst Published Sep 21, 2020, 3:12 PM IST
Highlights

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదరవుతోంది. పార్టీ అద్యక్షుడిని మార్చాలని కోరుతూ తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు లేఖ రాశారు.

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదరవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని కోరుతూ పార్టీ నేతలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఎల్ రమణను మార్చాలని సీనియర్ నేతలు కూడా చంద్రబాబును కోరారు. 

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులోనే ఉన్నారు. కోవిడ్ కారణంగా నాయకులు ఎవరు కూడా ఆయనను కలువలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు లేఖలు రాశారు. ఏడేళ్లుగా ఒకరే పార్టీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఎదుగుదల కనిపించడం లేదని వారన్నారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వారన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారుతూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచిన టీడీపీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పెద్గగా ప్రభావం చూపించలేకపోయింది. ఒక రకంగా తెలంగాణలోని ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్తా తెలంగాణ టీడీపీపై ఆయన శ్రద్ధ కనబరిచినట్లు కనిపించారు. అయితే, ఏపీలో ఓటమి తర్వాత తెలంగాణ టీడీపీని దాదాపుగా ఆయన పట్టించుకోవడమే మానేశారని చెప్పవచ్చు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తెలంగాణలో పార్టీని పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకుల్లో పూర్తిగా నిస్సత్తువ ఆవరించింది. ఎప్పుడో ఓసారి తెలంగాణ సీఎం కేసీఆర్ విధానాలపై విమర్శలు చేయడం తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఎవరూ పెద్దగా ప్రయత్నించడం లేదు. ఈ స్థితిలో పార్టీ అధ్యక్షుడిని మార్చాలనే డిమాండ్ ముందుకు వచ్చింది.

click me!