
హైదరాబాద్ : పూర్వపు తెలంగాణ ప్రజల ఆహారపు అలవాట్లపై తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ప్రజలకు బియ్యంతో అన్నం వండుకుని తినే పరిస్థితి వచ్చిందని... లేదంటే జొన్నలు, రాగులు, సజ్జలు తిని బ్రతికేవారని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ సర్కార్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం ప్రారంభించాకే తెలంగాణ ప్రజలు అహారపు అలవాట్లు మారాయని... అప్పటినుండి బియ్యంతో అన్నం తింటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలింది. చంద్రబాబు వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే... టిడిపి నాయకులు మాత్రం సమర్థిస్తున్నారు.
చంద్రబాబు అన్నం వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మీ బియ్యం కంటే మా బిర్యానీకే చరిత్ర ఎక్కువని అన్నారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదంటూ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. దీంతో తాజాగా తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మంత్రికి కౌంటరిచ్చారు.
టిడిపి రెండు రూపాయలకు కిలో పథకం కంటే ముందే తెలంగాణ బిర్యానీ ప్రఖ్యాతి చెందిదన్న మంత్రి వ్యాఖ్యలపై కాసాని స్పందించారు. బియ్యం- బిర్యానీ పై బహిరంగ చర్చకు రెడీనా? అంటూ నిరంజన్ రెడ్డికి సవాల్ విసిరారు. తనకే చరిత్రంతా తెలుసన్నట్లుగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని... ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానెయ్యాలని అన్నారు. పేదల ఆకలిబాధను తీర్చడానికి ఆనాడు టిడిపి ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంపై తీసుకువచ్చిందనే చంద్రబాబు అన్నారని... వీటిని వక్రీకరించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే బిఆర్ఎస్ నాయకులు చంద్రబాబు ఏం మాట్లాడినా దుష్ర్పచారం చేస్తున్నారని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.
Video మూర్ఖంగా మాట్లాడొద్దు... అన్నం తెలియని చరిత్రెవరిదో తెలుసుకో చంద్రబాబు..: నిరంజన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుని పోయిన టిడిపికి తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టిపెట్టడంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా దెబ్బతింది. ఒక్కో నాయకుడు పార్టీని వీడటంతో దాదాపుగా ఖాళీ అయ్యింది. అయితే టిడిపి క్యాడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకునే వుంది. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు తిరిగి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించి తెలంగాణలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా గత ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆహార అలవాట్ల గురించి మాట్లాడారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది తామే అన్నట్లుగా మాట్లాడి చంద్రబాబు మరోసారి మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. అవగాహనరాహిత్యంతో తెలంగాణపై అహంకారపూరిత వ్యాఖ్యలు తగదని హెచ్చరించారు. చరిత్ర తెలియకుండా చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు కాదు అసలు అన్నం గురించి తెలియనిది ఆంధ్రులకేనని చరిత్ర చెబుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ‘‘జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు ఇలా జొన్నలె తప్ప పల్నాటి ప్రజలకు సన్నన్నము సున్నాయే అంటూ ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడి రాసిన పద్యాన్ని మంత్రి గుర్తుచేసారు. కానీ 15 శతాబ్దం నాటికే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని... వెయ్యేల్లకు పైగా వరి పండించిన జాతి తెలంగాణ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 100-110 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పండిన వరి భారతదేశంలో మూలం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. ఈ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడిన చంద్రబాబు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.