తెలంగాణలో రెవెన్యూశాఖ రద్దుపై ఆందోళన: చినజీయర్ స్వామిని కలిసిన ఉద్యోగులు

By Nagaraju penumalaFirst Published Apr 13, 2019, 7:20 PM IST
Highlights

200 ఏళ్ల చరిత్ర గల రెవెన్యూ శాఖను మారుస్తామని, అలాగే కలెక్టర్ పేరును కూడా మారుస్తామని ప్రకటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చెయ్యడం కంటే మార్పులు చేర్పులు చేస్తే మంచిదని వారు సూచించారు. శాఖలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా సేవలందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వంటి ప్రచారంపై ఆ శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు.  రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వంటి ఆలోచనలు చేయోద్దని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 

గత కొద్ది రోజులుగా తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారని దాంతో తామంతా ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా అవకాశం దొరక్కపోవడంతో వారంతా శనివారం చిన జీయర్ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

రెవెన్యూ శాఖను రద్దు చెయ్యడం లేదా విలీనం చేస్తామని కేసీఆర్ చెప్తున్నారని ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తమ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ చినజీయర్ స్వామి దృష్టికి తీసుకువచ్చారు. 

200 ఏళ్ల చరిత్ర గల రెవెన్యూ శాఖను మారుస్తామని, అలాగే కలెక్టర్ పేరును కూడా మారుస్తామని ప్రకటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చెయ్యడం కంటే మార్పులు చేర్పులు చేస్తే మంచిదని వారు సూచించారు. 

శాఖలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా సేవలందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇస్తున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతోనే సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారని తమను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా తమ బాధలను చినజీయర్ స్వామికి విన్నవించుకున్నారు. తమను రక్షించాలని వేడుకున్నారు. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చినజీయర్ స్వామి తమకు హామీ ఇచ్చారని తెలిపారు. 

ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించామని అవకాశం ఇవ్వకపోవడంతో తాము చినజీయర్ స్వామియే దిక్కని భావించి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. 

తమ శాఖకు మంత్రి కూడా లేరని అందువల్లే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చినజీయర్ స్వామికి మెురపెట్టుకున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు గోల్కొండ సతీష్ స్పష్టం చేశారు.   

click me!