వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో భూపాలపల్లి - పరకాల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి - పరకాల జాతీయ రహదారిపై రాక పోకలు నిలిచిపోయాయి. సుమారు కీలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. వరద నీరు ముంచెత్తుతుండడంతో ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. రహదారిపై లారీలు నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ప్రవాహం పెరుగుతుండడంతో లారీ డ్రైవర్లు క్యాబిన్ పైకెక్కారు. గ్రామస్థులు, లారీ డ్రైవర్లు భయం గుప్పిట్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై.. సహయాకచర్యలకు పూనుకుంటోంది. లారీలలోకి పూర్తిగా వర్షపునీరు చేరుకుంది. క్యాబిన్లు మునుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామం జలదిబ్భంధనంలో చిక్కుకుంది. గ్రామంలోని వెయ్యిమంది ప్రజలు ఈ వరద చుట్టుముట్టడంతో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రామానికి సమీపంలో ఉన్న మొరంచవాగు పొంగిపొర్లడంతో వరద నీరు గ్రామంలోకి ఉదృతంగా వచ్చేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒకసారిగా మేల్కొన్న ప్రజలు హాహాకారాలు చేశారు. వెంటనే వరదలో కొట్టుకుపోకుండా ఇళ్లమీదికి ఎక్కి.. తమని తాము కాపాడుకుంటున్నారు. కాగా, క్షణక్షణానికి వరద నీరు పెరుగుతుండడంతో ప్రాణభయంతో కాపాడమంటూ వేడుకుంటున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లతో తమను రక్షించాలని మోరంచ గ్రామ ప్రజలు కోరుతున్నారు. వరద నీరు భారీగా చేరుకోవడంతో బిల్డింగ్ లకు పైకి ఎక్కి ప్రాణాల రక్షించుకుంటున్నారు. మోరంచవాగు వరద ప్రవాహం గ్రామంలో ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో వరద నీటిలో ఇండ్లు తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది.
డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్ట్.. సామర్థ్యానికి మించి చేరుతున్న ఇన్ ఫ్లో.. మొరాయిస్తున్న 4 గేట్లు...
రాత్రి పడుకునే సమయంలో ఇంత వరద లేదని.. తెల్లారేవరికి వరద చుట్టుముట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తాము సహాయం కోసం ఎదురుచూస్తున్నామని.. ఇప్పటి వరకు ఎవరు తమను రక్షించడానికి రాలేదన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు.
‘ఉదయం నాలుగు గంటల నుంచి వరద నీరు ఇళ్లల్లోకి వచ్చింది. ఊరు మొత్తం జలదిగ్బంధంలో ఉంది. ఊరు చుట్టూ నీళ్లే ఉన్నాయి. ఊర్లోకి వచ్చే రోడ్డు మార్గాలు లేవు. బోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. హెలికాప్టర్ ద్వారా మాత్రమే కాపాడాల్సి ఉంటుందని’ స్ధానిక నాయకుడు ఒకరు తెలిపారు. తాము ఈ విషయాన్ని తెల్లవారుజామునే స్థానిక ఎమ్మెల్యేకు, డయల్ హండ్రెడ్ కు, భూపాలపల్లి, ములుగు జిల్లాల రెస్క్యూ టీంకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్డీఆర్ఎఫ్ బృందం కాసేపట్లో భూపాలపల్లి చేరుకోనుంది.