తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరికి పోలీసుల అనుమతి.. హాజరు 10 వేలు దాటకూడదని షరతు

By Sumanth Kanukula  |  First Published Sep 14, 2023, 9:44 AM IST

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమైంది.



తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్న ఈ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పది లక్షల జనసమీకరణ చేయాలని భావిస్తోంది. పోలీసులు అనుమతి ఇచ్చినా? లేకపోయినా? బహిరంగ సభను నిర్వహించి తీరుతామని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే తాజాగా కాంగ్రెస్ నిర్వహించనున్న వియజభేరి సభకు పోలీసులు అనుమతించారు. అయితే 25 షరతులను విధించారు. అందులో సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని, సాయంత్రం 4 గంటల  నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సభను నిర్వహించాలనే షరతులు కూడా ఉన్నాయి. అయితే ఈ షరతులు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాయి. 

Latest Videos

ఇక, తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు అనుమతించిన రాచకొండ పోలీసులు విధించిన షరతులను పరిశీలిస్తే.. ప్రొఫెషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నిమగ్నం చేయాలి,  ఒకే బాక్స్ రకం స్పీకర్‌ను ఉపయోగించాలి, 55 డీబీ కంటే తక్కువ శబ్దం స్థాయిని నిర్వహించాలి, డ్రోన్ల వినియోగంపై నిషేధం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేయరాదు, రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదు, నిర్వాహకులు తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, హాట్ ఎయిర్ బెలూన్‌లపై నిషేధం వంటివి ఉన్నాయి. 

అయితే సభకు అనుమతించిన పోలీసులు విధించిన షరతులపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో జరగాల్సిన బీజేపీ సమావేశానికి, పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే బీఆర్‌ఎస్ సమావేశానికి ఇలాంటి షరతులు విధించారా అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు విధించిన కొన్ని షరతులు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. 
 

click me!