భారీవర్షాలు: ఢిల్లీ నుండి సీఎస్‌తో కేసీఆర్ సమీక్ష, తెలంగాణ సర్కార్ హై అలెర్ట్

By narsimha lodeFirst Published Sep 7, 2021, 11:11 AM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్  ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకొన్నారు.ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇవాళ కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ అయింది. వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో  ఆయన ఫోన్ లో చర్చించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకొన్నారు. రానున్న రెండు మూడు రోజులు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సీఎస్ ను ఆదేశించారు. 


భారీ వర్షాలతో  వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే  విద్యుత్తు, రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్  శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ  ఉద్యోగులను అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు  పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు.  వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.  ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు

ఈ నెల 1వ తేదీ నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.  ప్రధాని మోడీ సహా ఇతర కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  వర్ష ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 

click me!