మాపై ఏడవడం కాదు, దమ్ముంటే నిధులు తెప్పించండి: బీజేపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Aug 24, 2019, 7:50 PM IST
Highlights


ప్రభుత్వ పథకాలపై ఏడవడం, విమర్శలు చేయడం కాకుండా దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు సైతం అనేకసార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. 
 

హైదరాబాద్‌: బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. మా పథకాలపై పడి ఏడుస్తున్నారంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ పథకాలపై ఏడవడం, విమర్శలు చేయడం కాకుండా దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు సైతం అనేకసార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. 

జాతీయ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కనిపిస్తుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మాత్రం అవినీతి కనబడుతుందా అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్‌ సైతం సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. 

బీజేపీ మాదిరిగా టీఆర్ఎస్ పార్టీవి మిస్డ్‌ కాల్‌ సభ్యత్వాలు కావని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అంతేకానీ కావాలని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. 

పనిచేసే అధికారులపై ఇష్టానుసారం విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంటే అవగాహనా లోపంతో కుంభకోణాలు జరిగాయంటూ పదేపదే విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ప్రభుత్వ హాస్టల్స్ లో, రేషన్ లలో సన్నబియ్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకొచ్చారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని కానీ కేంద్రమంత్రి వర్గంలో బీసీలు లేరన్నారు. బీజేపీ  రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గుళ్లు పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 

click me!