కేంద్రమంత్రి సదానందగౌడను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి

By Siva KodatiFirst Published Oct 9, 2019, 6:02 PM IST
Highlights

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను కలిశారు. ఈ సందర్భంగా యాసంగికి ఎరువులు కేటాయించాలని నిరంజన్ రెడ్డి కోరారు. 

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను కలిశారు. ఈ సందర్భంగా యాసంగికి ఎరువులు కేటాయించాలని నిరంజన్ రెడ్డి కోరారు.

ఇంపోర్టెడ్ యూరియా కాకుండా స్థానికంగా ఉత్పత్తి చేసిన యూరియాను సరఫరా చేయాలని ఆయన కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.  వర్షాలు సమృద్దిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి సాగు విస్తీర్ణం పెరిగిందని.. రాష్ట్రంలో కోటి పది లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు.

రబీలో సాధారణ విస్తీర్ణంకన్నా 8.5 లక్షల ఎకరాలు పెరిగి సుమారుగా 42 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశముందని సింగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు నిండిపోవడంతో ఈ రబీ సీజన్ లో ఎరువుల వినియోగం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో తాము గతంలో విజ్ఞప్తి చేసిన 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని సదానంద దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఈ అక్టోబరు మాసానికి కేటాయించిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఈ నెల 20వ తేదీ లోపు పంపించాలని నిరంజన్ రెడ్డి కోరారు.

దీనిపై స్పందించిన సదానందగౌడ.. మార్చి 2020 నాటికి రామగుండం ఎరువుల కార్మాగారం ట్రయల్ రన్ పూర్తవుతుందన్నారు. ఆ ఏడాది ఖరీఫ్ నుంచే దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుంచే ఎరువులు సరఫరా చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ ఉన్నారు. 

click me!