బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల వరుస మరణాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల వరుస మరణాలు బాధాకరమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.గురువారం నాడు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మూడు రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకోవడంపై కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మరో వైపు ఇవాళ తెల్లవారుజామున మరో విద్యార్ధి లిఖిత మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. లిఖిత మృతికి సంబంధించిన విషయమై బాసర ట్రిపుల్ ఐటీ కి చెందిన అధికారులతో మాట్లాడినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్ధులు తొందరపడవద్దని మంత్రి సూచించారు.
గత కొంత కాలంగా బాసర ట్రిపుల్ ఐటీ మీడియాలో తరచుగా కన్పిస్తుంది. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్ధులు గతంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంబంధించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులతో చర్చించారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను విరమించాలని కోరారు. విద్యార్ధుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది.
మరో వైపు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు విద్యార్ధులతో ఒక్క రోజు గడిపారు. విద్యార్ధుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్ధుల డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు.
also read:బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల వరుస మరణాలు: విపక్షాల ఆందోళన, ఉద్రిక్తత
అయితే మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినులు మరణించడంతో మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ అంశం మరోసారి చర్చకు దారి తీసింది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తరచుగా ఎందుకు మృతి చెందుతున్నారనే విషయాన్ని విద్యార్ధి సంఘాలు, విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.