కిషన్ రెడ్డి కేంద్ర మంత్రా, నిస్సహాయ మంత్రా: మంత్రి కేటీఆర్ సెటైర్లు

By narsimha lodeFirst Published Nov 8, 2020, 12:41 PM IST
Highlights

 వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు తాము ప్రయత్నిస్తోంటే... బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 
 


హైదరాబాద్:  వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు తాము ప్రయత్నిస్తోంటే... బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్  టీఆర్ఎస్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పార్టీ ప్రజా ప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం  అప్రమత్తంగా ఉన్నందునే  హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో వర్షాలు, వరదలు సమయంలో  అతి జాగ్రత్తగా వ్యవహరించినందునే ప్రాణ నష్టం తక్కువగా ఉందన్నారు.

కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన గుర్తు చేశారు.ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ 800 మందితో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ నగరానికి కూడ ఈ రకమైన వ్యవస్థ లేదని ఆయన చెప్పారు.

హైద్రాబాద్ నగరంలోని చాలా నాలాలపై అక్రమ కట్టడాలున్నాయని ఆయన చెప్పా,రు. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు.

భారీ వర్షాలకు నగరంలోని వందల కాలనీలు నీట మునిగినట్టుగా ఆయన  ఈ సందర్భంగా గుర్తు చేశారు.నగరంలో వర్షాలు కురిసిన సమయంలో తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిదులు 15 రోజుల పాటు విస్తృతంగా పర్యటించినట్టుగా చెప్పారు.

వర్షాలు కురుస్తున్న సమయంలోనే వరద బాధితులకు రూ. 550 కోట్లను సీఎం  ప్రకటించారన్నారు. పేదల కష్టాలు చూసినందునే కేసీఆర్ నిధులను విడుదల చేశారని ఆయన చెప్పారు. ఈ ఏడాది నగరంలో అసాధారణ వర్షపాతం నమోదైందన్నారు. 

జీహెచ్ఎంసీలో 4.30 లక్షల కుటుంబాలకు సహాయం అందించినట్టుగా కేటీఆర్ చెప్పారు. హైద్రాబాద్ లో 3.70 లక్షల కుటుంబాలకు సహాయం చేశామన్నారు. మిగిలినవి జీహెచ్ఎంసీ  పరిసర ప్రాంతాల్లోని కార్పోరేషన్లలోని లబ్దిదారులకు నష్టపరిహారం ఇచ్చినట్టుగా కేటీఆర్ తెలిపారు.

920 టీమ్ లు ఏర్పాటు చేసి వరద సాయం అందించామన్నారు.  తాము వరద సహాయం చేస్తోంటే, కాంగ్రెస్ ,బీజేపీ నేతలు బురద రాజకీయంలో బిజీగా ఉన్నారని ఆయన సెటైర్లు వేశారు.

పుట్టెడు కష్టంలో ఉన్న పేదలకు తాము అండగా ఉంటే... బీజేపీ,కాంగ్రెస్ నేతలు  దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్నారని ఆయన  విమర్శించారు.  పార్టీలతో సంబంధం లేకుండా వరద బాధితులకు పరిహారం చెల్లించినట్టుగా ఆయన చెప్పారు.హైద్రాబాద్ తో పాటు నగరానికి వెలుపల ఉన్న 28 మున్సిపాలిటీల్లో 22 మున్సిపాలిటీల్లోని 40 వేల మంది వరద ముంపునకు గురయ్యారని ఆయన చెప్పారు. వారందరికి పరిహారం చెల్లించామన్నారు.

కేంద్రం ఒక్క పైసా కూడ విదల్చలేదని ఆయన చెప్పారు.తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క పైసా అయినా తీసుకురాగలిగారా అని ఆయన అడిగారు.వరద సహాయం కోసం ప్రధానికి లేఖ రాస్తే కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు.

బీజేపీ కార్యకర్తలే సాయం తీసుకొని తెల్లారే ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు దుబ్బాకలో డిపాజిట్ కూడ రాదని ఆయన చెప్పారు. కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రా, నిస్సహాయ మంత్రా చెప్పాలన్నారు. ధర్నాలు చేయవద్దు.. అర్హులైతే ఇంటికి వచ్చి సహాయం చేస్తామని మంత్రి ప్రజలను కోరారు. 

click me!