ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ ను కోరారు. ఇలా చేస్తే 100 సీట్లు బీఆర్ఎస్ కు గ్యారెంటీ అని ఆయన చెప్పారు.
వరంగల్: ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారెంటీ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో మంత్రి దయాకర్ రావు మంగళవారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే కష్టమన్నారు. తన సర్వేలు ఏనాడు తప్పు కాలేదని దయాకర్ రావు చెప్పారు. రాష్ట్రంలో 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. వీరిని మార్చాలని ఆయన కోరారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఓడించే శక్తి తమకే ఉందని కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.
2014-18 మధ్య కాలంలో టీడీపీ, కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు మొదటి నుండి పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని దయాకర్ రావు మాటల్లో వ్యక్తమైంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్ధులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించవద్దని దయాకర్ రావు కేసీఆర్ ను కోరారు.ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాకంగా మ ారాయి. ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.