‘ఇంధనంపై తెలంగాణ అధిక వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ డ‌బ్బంతా ఎక్క‌డికి పోతోంది’ - హ‌ర్దీప్ సింగ్ పూరీ

Published : Apr 29, 2022, 10:45 AM IST
‘ఇంధనంపై తెలంగాణ అధిక వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ డ‌బ్బంతా ఎక్క‌డికి పోతోంది’ - హ‌ర్దీప్ సింగ్ పూరీ

సారాంశం

పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఇన్ని వేల కోట్ల డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.   

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించాల‌ని బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇటీవ‌ల కోరాయి. అయితే ఈ విష‌యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గురువారం స్పందించారు. ఆయా ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, రాజస్థాన్‌లు అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నాయని ఆయ‌న  వరుస ట్వీట్లలో మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నటీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం అత్యధికంగా వ్యాట్‌ను వ‌సూలు చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2021 వరకు రూ. 56,020 కోట్లను వ్యాట్‌గా వసూలు చేసిందని అన్నారు. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం పూర్త‌య్యే నాటికి మరో రూ. 13,315 కోట్లు సమకూరుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఇవ‌న్నీ కలిపితే దాదాపు రూ. 70,000 కోట్లకు పైగా అవుతుంద‌ని చెప్పారు. అయితే ఈ డబ్బు ఎక్కడికి పోయింద‌ని హ‌ర్దీప్ సింగ్ పూరీ ప్ర‌శ్నించారు. 

‘‘ తెలంగాణలో ఆస‌క్తికరమైన సందర్భం. రాష్ట్రం పెట్రోలు, డీజిల్‌పై అత్యధిక వ్యాట్‌ను విధించింది. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2021 వరకు రూ.56,020 కోట్లను వ్యాట్‌గా వసూలు చేసింది. 2021-22 నాటికి రూ.13,315 కోట్లు పెరుగుతుందని అంచనా. మొత్తంగా రూ. 69,334 కోట్ల వరకు అవుతుంది. అదంతా ఎక్కడికి పోయింది? ’’ అని మంత్రి ట్వీట్ చేశారు. 

వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) తగ్గించాలని ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాలను కోరినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు మధ్య  తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. అయితే గత ఏడాది నవంబర్‌లో కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. వ్యాట్‌ను కూడా తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. కేంద్రం సూచ‌న‌తో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఢిల్లీ వంటి మరికొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. కానీ మహారాష్ట్ర, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు పన్నును తగ్గించలేదు.

దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంతో స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఇందులో ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇంధనంపై పన్నులను తగ్గించాలని ఈ రాష్ట్రాల సీఎంల‌కు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. దీనిపై రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేతో సహా వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు గ‌ట్టిగా స్పందించారు. వ్యాట్‌ని తగ్గించాల‌ని రాష్ట్రాలను కోరే బదులుగా ఎక్సైజ్ ట్యాక్స్ లో మరింత కోత విధించాలని ప్రధాని సూచించారు.

ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ‘‘ అన్ని ఇంధన పన్నులలో 68 శాతం కేంద్రం తీసుకుంటోంది. అయినా ప్రధానమంత్రి బాధ్యత నుంచి తప్పుకున్నారు.మోదీ ఫెడరలిజం సహకరించడం లేదు. ఇది బలవంతం.’’ అని పేర్కొన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పన్నులను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రాష్ట్రాలతో పోల్చడం ద్వారా పూరీ స్పందించారు. హర్యానాలో పెట్రోల్ పై 18 శాతం, డీజిల్ పై 16 శాతం వ్యాట్ అత్యల్పంగా ఉందని ఆయన చెప్పారు. ‘‘ దేశానికి చెందిన ఒక ఔత్సాహిక నాయకుడు వీటికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడు, కానీ తన సొంత పార్టీ పాలిస్తున్న రాజస్థాన్ విషయంలో మౌనంగా ఉన్నారు. ఇక్క‌డ దేశంలో అత్యధికంగా 31.08 శాతం, రూ. 1500 కేఎల్ సెస్ ను విధిస్తోంది ’’ అని ఆయ‌న అన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.14.50 నుంచి రూ.17.50 వరకు వ్యాట్ విధిస్తున్నారని, ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు రూ.26 నుంచి రూ.32 వరకు ఉన్నాయని ఆయన అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా