పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలి: కేంద్రానికి తెలంగాణ లేఖ

By narsimha lodeFirst Published Sep 23, 2022, 9:47 AM IST
Highlights

;పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాదు భద్రాచలం వద్ద రక్షణ గోడను  కేంద్రమే నిర్మించాలని ఆ లేఖలో తెలంగాణ కోరింది. 

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.తమ రాష్ట్ర అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్  కేంద్ర జలవనరులశాఖ సెక్రటరీ పంకజ్ కుమార్ కు లేఖ రాశారు. 

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై సమగ్ర అధ్యయనం చేయాలని ఆ లేఖలో రజత్ కుమార్ కోరారు. పోలవరంపై తమ రాష్ట్రం అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని రజత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న 30 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీని 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్చి కెపాసిటీకి పెంచుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలంగాణ ప్రబుత్వం అభిప్రాయపడింది.  అదే జరిగితే తెలంగాణలో ముంపు మరింత పెరిగే అవకాశం ఉందని రజత్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు వెనుక వైపున ఉన్న  నీటి వనరులపై దీని ప్రభావం ఉంటుందన్నారు.  పంటపొలాలు, ఐటీసీ పార్క్,  భద్రాచలం పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  గోదావరి నది వరద ప్రవాహం నుండి భద్రాచలాన్ని రక్షించేందుకు రక్షణ గోడను నిర్మించాలని ఆయన కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వమే ఈ రక్షణ గోడను నిర్మాణం చేపట్టాలని ఆ లేఖలో కోరారు. 

పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల  లెవల్ లో నీటిని నిల్వ చేస్తే ప్రతి ఏటా భద్రాచలంపై ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని రజత్ కుమార్ చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్  విషయమై సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్  సీఈలతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టాన్ని మళ్లీ అంచనా వేయాలని కూడా తెలంగాణ కోరింది. ఈ విషయమై స్టేక్ హోల్డర్స్ రాష్ట్రాలతో చర్చించాలని కూడ తెలంగాణ కోరింది. 

ఈ నెల 14వ తేదీన స్టేక్ హోల్డర్స్ రాష్ట్రాలతో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఒడిశా ప్రభుత్వం అభ్యంతరంతో సమావేశం వాయిదా పడింది.ఈ నెల 29వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సన్నాహలు చేస్తుంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అనుమానాలను నివృత్తి చేస్తామని ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల ప్రకటించారు. అన్నీ అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించినట్టుగా చెప్పారు. 

also read:పోలవరం ముంపు: ఈ నెల 29న నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ మీటింగ్

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వచ్చిన వరదల సమయంలో భద్రాచలంతో పాటు సమీప గ్రామాల ప్రజలుతీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 1986 తర్వాత అదే తరహలో గోదావరి నదికి ఈ ఏడాది జూలై మాసంలోనే భారీ వరదలు వచ్చాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి సుమారు 71 అడుగులు దాటి ప్రవహించింది. ఈ నేపథ్యంలో భద్రాచలానికిసమీపంలోని విలీన మండలాలతో పాటు భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి., భద్రాచలం ముంపునకు గురి కాకుండా  రక్షణ గోడ అడ్డుకొంది. అయితే రక్షణ గోడలేని ప్రాంతాల గుండా గోదావరి వరద నీరు ప్రవేశించింది. గోదావరికి వరద నీరు వచ్చిన సమయంలో ఇదే రకంగా తాము ఇబ్బందులు పడుతున్నామని భద్రాచలం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

click me!