వారంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి: కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

By narsimha lodeFirst Published Sep 8, 2021, 2:38 PM IST
Highlights


తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు వారంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పిల్లల చికిత్స విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారో చెప్పాలని కోరింది కోర్టు.

హైదరాబాద్: కరోనాపై వారంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పిల్లల చికిత్సకు తీసుకొన్న వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని బుధవారం నాడు ఆదేశించింది. లేకపోతే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, కేంద్ర నోడల్ అధికారి కోర్టుకు రావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కరోనా విషయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

బుధవారం నాడు తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది.కరోనాతో ఇప్పటికే అనేక మంది మరణించారని హైకోర్టు గుర్తు చేసింది.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నష్టాన్ని నివారించాలని హైకోర్టు సూచించింది. తాము ఆదేశించినా కూడ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై  హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుతున్నాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండలో కరోనా పాజిటివిటీ రేటు 1 శాతానికిపైగా ఉందని కోర్టు ప్రస్తావించింది. వారంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని  హైకోర్టు ఆదేశించింది.అంతేకాదు కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించింది.

కరోనా విషయంలో తమ సూచనలను ప్రభుత్వం పాటించకపోవడంపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ రామచంద్రరావు, వినోద్‌కుమార్ లతో కూడిన ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది.కరోనా థర్డ్‌వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ ఆగదని కోర్టు వ్యాఖ్యానించింది.


 

click me!