ప్రైవేట్ ఆసుపత్రుల నుండి అధిక ఫీజులు బాధితులకు రీఫండ్ చేయించాలి: తెలంగాణ హైకోర్టు

By narsimha lodeFirst Published Jun 2, 2021, 4:56 PM IST
Highlights

కరోనా చికిత్సకి అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల నుండి  బాధిత కుటుంబాలకు డబ్బులు ఇప్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

హైదరాబాద్:  కరోనా చికిత్సకి అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల నుండి  బాధిత కుటుంబాలకు డబ్బులు ఇప్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.బుధవారం నాడు కరోనా కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు.  ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

also read:అన్ని భవిష్యత్తులోనే చేస్తారా?..: కరోనాపై తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు ఆగ్రహం

అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల పై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. 174 ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. 21 ఆసుపత్రుల కోవిడ్ అనుమతులు రద్దు చేసినట్టుగా చెప్పారు. బాధితుల నుండి అధికంగా వసూలు చేసిన ఫీజులను ఆసుపత్రులు చెల్లించాయా అని  హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్సుల రద్దు కంటే బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించడమే ముఖ్యమని కోర్టు తెలిపింది.అధిక ఫీజులు వసూలు చేసిన చార్జీలు తిరిగి ఇవ్వకపోతే  లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

లైసెన్సులు రద్దు చేశాక ఆసుపత్రులు బాధితులకు డబ్బులు ఇవ్వకుండా మొండికేస్తాయి... మెడపై కత్తి పెట్టి బాధితులకు డబ్బులు ఇప్పించాలని  కానీ తలను నరికేస్తే ఏం లాభమని హైకోర్టు వ్యాఖ్యానించింది.తొలి దశ కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుండి రూ. 3కోట్లను బాధితులకు ఇప్పించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖాధకారి శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ధరలను నిర్ణయించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే గత ఏడాది జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కొత్తగా జీవో జారీ చేయాలని హైకోర్టు సూచించింది. థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కొంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తాము సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు డీహెచ్ తెలిపారు. అయితే ఈ విషయమై బ్లూ ప్రింట్ ఇవ్వాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

click me!