ఆర్టీసీ సమ్మె: యూనియన్లకూ కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మెుట్టికాయలు

By Nagaraju penumalaFirst Published Oct 15, 2019, 4:14 PM IST
Highlights

పండుగ సమయాల్లో సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించింది. 
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమించాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సమ్మెపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

పండుగలు, స్కూళ్ల సెలవుల సమయాల్లో సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించింది. 

యూనియన్లకు హైకోర్టు మెుట్టికాయలు 
ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అయితే సమ్మె ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడింది. 

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకుండా పోయాయన్నారు. 

సమ్మె అనేది కార్మికుల ఆఖరి అస్త్రమని చెప్పుకొచ్చారు. సమ్మె చేయకపోతే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని తేల్చి చెప్పారు. 

సమ్మె ఆఖరి అస్త్రం అయితే ఫలితం రాలేదు కదా అని హైకోర్టు నిలదీసింది. సమ్మె చట్ట విరుద్ధమని విరమించాలని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఎలా అంటూ నిలదీసింది. 

తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని అయితే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం లేదని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదని ఆహ్వానిస్తే చర్చలు సఫలమైతే సమ్మెను విరమిస్తామని తెలిపారు. 

అంతేకాదు తమ సమస్యలు తెలిపేందుకు ఆర్టీసీ సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేదరని చెప్పుకొచ్చారు. అందువల్లే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఎవరికి చెప్పుకోవాలో తెలపాలని జేఏసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తెలిపారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చర్యలపై హైకోర్టు అసహనం 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించింది. ఎందుకు కొత్త బస్సులు కొనుగోలు చేయలేదో చెప్పాలని నిలదీసింది. 

ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా పోయిందని నిలదీసింది. మహారాష్ట్ర, గుజరాత్ లలో ప్రజారవాణా వ్యవస్థ బాగుందని అని అందుకే అక్కడ పెట్టుబడులు వస్తున్నట్లు అభిప్రాయపడింది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రజలవైపు ఉండదా అంటూ ఒకానొక దశలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదో తెలిపాలని ప్రశ్నించింది. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

సమ్మె విరమించి ఇకనైనా చర్చలకు వెళ్లాలని ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది హైకోర్టు. ఇరువాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 18కు విచారణను వాయిదా వేసింది. 

click me!