మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్, ఉద్రిక్తత

By Nagaraju penumalaFirst Published Oct 15, 2019, 3:36 PM IST
Highlights

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పక్కనే ఉన్న పోలీసుల వాహనంపై రాళ్లదాడికి దిగారు. దాంతో పోలీసుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 
 

 సంగారెడ్డి: సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్డెక్కారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇంటిని ముట్టడిస్తానంటూ బయలు దేరారు. 

వందలాది మంది ఆర్టీసీ కార్మికులతో హైదరాబాద్ బయలుదేరేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పక్కనే ఉన్న పోలీసుల వాహనంపై రాళ్లదాడికి దిగారు. దాంతో పోలీసుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

ఇకపోతే సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆర్టీసీ విలీనంపై మంగళవారం నాటికి సీఎం కేసీఆర్ ను ఒప్పించాలని లేనిపక్షంలో మంత్రి పువ్వాడ ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు.  

ఆర్టీసీ విలీనానికి ఒప్పించకపోతే సంగారెడ్డి డిపోకు చెందిన 600 మంది కార్మికులతో హైదరాబాద్ తరలివచ్చి మంత్రిని ఘోరావ్‌ చేస్తానని హెచ్చరించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు.  

అంతేకాదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులతో పాటు తాను కూడా సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫోటోలకు పాలు పోసి పూజలు చేసిన ఆర్టీసీ కార్మికులే నేడు ఆయనను నిందించే పరిస్థితి రావడం విచారకమన్నారు.

click me!