
Heavy rains in Telangana: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం నాడు ఆయన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు, వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధుల గురించి హెచ్చరించారు. వర్షం, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలను మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ మోర్తజా రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్లు అందుబాటులో ఉండాలనీ, ఎవరూ సెలవులు తీసుకోవద్దని కూడా మంత్రి హరీశ్ రావు సలహా ఇచ్చారు. వైద్యులు ఆరోగ్య శిబిరాలలో పాల్గొని, అవసరమైనప్పుడు రోగనిర్ధారణ, ఫార్మాస్యూటికల్ డెలివరీకి భరోసా ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు కొత్తగూడెం నుంచి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి మంచిర్యాల నుంచి ఆపరేట్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ క్యాంపులు, ఇతర చర్యలతో సమన్వయం చేయాలని కోరారు.
ఇదిలావుండగా, రాష్ట్రంలో ఈ వారం ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో దాదాపు అన్ని జలాశయాలు నీటితో నిండాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో అనేక ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా భద్రచలంలో పరిస్థితులు దారుణంగా మారాయి. భారీ స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో అక్కడి నుంచి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. గోదావరి వరద ఉదృతి 68 అడుగులకు పెరిగింది. ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు.. ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం AMC కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
సహాయ చర్యలు కొనసాగించడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీని సైతం రంగంలోకి దించారు. సహాయ చర్యలు కొనసాగించడానికి హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిని పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఈ ఏరియల్ సర్వేలో పాల్గొనున్నారు. ఇదిలావుండగా, దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరో రెండు రోజులు దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ కూడా ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నాయి.