తెలంగాణలో ఓటర్లు 2.95 కోట్లు.. ముసాయిదా జాబితా విడుదల..

By Sumanth KanukulaFirst Published Nov 11, 2022, 9:37 AM IST
Highlights

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నిక సంఘం తెలిపింది. ఈ మేరకు ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. 

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నిక సంఘం తెలిపింది. ఈ మేరకు ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 8 లక్షలు తగ్గింది. గతేడాది ప్రత్యేక సమ్మరీ రివిజన్ ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.03 కోట్లుగా ఉంది. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పురుష ఓటర్లు 1.48 కోట్లు, మహిళా ఓటర్లు 1.47 కోట్లు, థర్డ్ జెండర్ ఓటర్లు 1,654 మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం119 నియోజకవర్గాలో 34,891 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. 

రాష్ట్రంలో ఇతరులు, ఎన్‌ఆర్‌ఐల వంటి ప్రత్యేక వర్గాలను మినహాయించి మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య 2,95,62,932గా ఉంది. ఇక, 2,737 మంది ఎన్నారై ఓటర్లు, 15,067 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. వీరితో కూడా కలుపుకుంటే.. రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టుగా అవుతుంది. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారు.

ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2022 తర్వాత జనవరి 5న ప్రచురితమైన ఫైనల్ రోల్స్‌తో పోలిస్తే 3.45 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని.. 2023 ప్రత్యేక సమ్మరీ రివిజన్ కింద డేటాను నిరంతరం అప్‌డేట్ చేయడంలో భాగంగా 11.36 లక్షల ఓట్లను తొలగించామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం (నవంబర్ 9) ప్రచురించామని ఆయన చెప్పారు. 

ఓటర్ల పేర్లు తొలగింపుపై, ఇతర అంశాలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలతో ప్రతివారం సమావేశాలు నిర్వహించి ఈసీ జారీ చేసిన ఆదేశాల మేరకు వచ్చిన ఫారాలు, తీసుకున్న చర్యల వివరాలను తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవల్ అధికారులు బూత్ అవేర్ నెస్ గ్రూపులతో వారానికోసారి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

click me!