25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం..

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 12:32 PM IST
Highlights

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. ఈ నెల 25వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం కానున్న ఉత్సవాలు.. అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. ఈ నెల 25వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం కానున్న ఉత్సవాలు.. అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వసలహాదారు రమణాచారి, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతేడాది కంటే రెండింతలు వైభంగా ఈ సారి బతుకమ్మ సంబరాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ పండగ ఉంటుందని సీఎస్ తెలిపారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్‌ 3న ట్యాంక్‌ బండ్‌ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. ఎల్‌బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ముందుజాగ్రత్త చర్యగా హుస్సేన్ సాగర్ సమీపంలో,  బతుకమ్మను నీళ్లలో వదిలే అన్ని పాయింట్ల వద్ద ఈతగాళ్లను మోహరించాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో పిల్లర్లను బతుకమ్మ పండుగను తలపించేలా అలంకరించాలని ఆదేశించారు. పండుగ గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. 

ఇక, తెలంగాణ జాగృతి సాంస్కృతిక సంస్థ అధినేత్రి, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కవిత గతేడాది దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో బతుకమ్మ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

click me!