
హైదరాబాద్: తెలంగాణలోని 16 ప్రజా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిలో విప్లవ రచయితల సంఘం (విరసం), పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తుడుందెబ్బ వంటి ప్రజా సంఘాలు ఉన్నాయి. ఈ సంస్థలు నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కు అనుబంధంగా పనిచేస్తున్నాయని, చట్ట వ్యతిరేక, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.
అంతేకాకుండా, తమ కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని కూడా ప్రభుత్వం ఆరోపించింది. అందుకు వాటిని చట్టవిరుద్ధ సంఘాలు (అన్ లాఫుల్ అసోసియేషన్స్) గా గుర్తించి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో నెంబర్ 73ను జారీ చేశారు ఈ ఉత్తర్వులు మార్చి 30 నుంచి ఏడాది పాటు అమలులో ఉంటాయని, రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఆ జీవోలో తెలిపారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఎకెఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసి స్టూడెంట్ యూనియన్ (ఏఎస్యూ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్), తుడుందెబ్బ (టీడీ), ప్రజా కళా మండలి (పీకెఎం), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోర్ అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ , సివిల్ లిబర్టీస్ కమిటీ (పౌర హక్కుల సంఘం), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏపీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), రెవెల్యూషనరీ రైటర్స్ అసోసిషయేషన్ (విరసం) మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.
బీమా- కోరెగావ్ కేసు, ఉపా చట్టం కింద అరెస్టయిన విరసం నేత వరవరరావు, జీఎన్ సాయిబాబా, రోనా విల్సన్, తదితరులను విడుదల చేయాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి చట్ట వ్యతిరేక సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు ప్రకటించింది.