ఖైరతాబాద్ మహా గణపతి: తొలి పూజ చేసిన తెలంగాణ , హర్యానా గవర్నర్లు

By narsimha lode  |  First Published Aug 31, 2022, 11:02 AM IST

ఖైరతాబాద్ వినాయక విగ్రహనికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర రాజన్, బండారు దత్తాత్రేయలు తొలి పూజలు చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఖైరతాబాద్ మహా గణేష్  విగ్రహనికి బుధవారం నాడు తొలి పూజ నిర్వహించారు.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హర్యానా గవర్నర్  బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్ గణేషుడికి పూజలు నిర్వహించిన తర్వాత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా ప్రతి పండుగలో ఒక సందేశం ఉంటుందన్నారు. మనం చేసే ఏ కార్యక్రమమైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగాలంటే వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఉందని బండారు దత్తాత్రేయ చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి  అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ బండారు దత్తాత్రేయ  ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని   తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  చెప్పారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్ గణేష్  ఉత్సవాలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ చైర్మెన్ సుదర్శన్ ను గవర్నర్ అభినందించారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు రాలేకపోయామన్నారు. కరోనా వంటి వ్యాధులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్ధిస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. మనమంతా తెలంగాణ అభివృద్ది కోసం పనిచేయాలని గవర్నర్ కోరారు. 

ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా  గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు.

ఖైరతాబాద్ లో తొలిసారిగి మట్టి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. 50 అడుగుల మట్టి విగ్రహన్ని తయారు చేయించింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి. ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహనికి తొలి పూజలు చేసిన తర్వాత విగ్రహన్ని సందర్శించుకొనేందుకు భక్తులకు అనుమతిని ఇచ్చారు. 

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకొనేందుకు వందలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందను ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గణేష్ విగ్రహన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ ప్రాంతంలో 9 మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలీసులు అనుక్షణం పరిశీలించనున్నారు. గణేష్ మండపం వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
 

click me!