తెలంగాణ: అగ్రవర్ణ పేదలకు శుభవార్త.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ, అర్హులు వీరే

By Siva KodatiFirst Published Aug 24, 2021, 7:56 PM IST
Highlights

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది

అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధ్రువపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.  

ఈడబ్ల్యూఎస్‌ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్‌ వారికి నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష రుసుముల్లో మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. రిజర్వేషన్ల కోసం సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలకు సవరణ చేశారు. నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీచేయడం నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.  

click me!