జగన్ బాటలో కేసీఆర్: ప్రభుత్వం చేతికి లిక్కర్ దుకాణాలు?

By narsimha lodeFirst Published Sep 25, 2019, 4:03 PM IST
Highlights

లిక్కర్ దుకాణాలను  ప్రభుత్వమే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని పూర్తిగా జగన్ సర్కారే చేతుల్లోకి తీసుకోనుందని తెలిసినప్పటినుంచి  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కూడా ఈ విషయమై ఆలోచనలు మొదలుపెట్టాడు. తెలంగాణాలో కూడా మద్యం విధానాన్ని ప్రభుత్వమే పూర్తిగా చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని అధికారులతో చర్చలు మొదలు పెట్టాడు. 

ఈ నెలాఖరుకల్లా పాత మద్యం విధానం ముగియనుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రావాలి. ఇలా అక్టోబర్ 1వ తారీఖు నాటికే నూతన విధానం అమలులోకి రావాలంటే ఈ పాటికే టెండర్ల ప్రక్రియ పూర్తికావలిసింది. కానీ ఇంతవరకు టెండర్లప్రక్రియ మొదలవనే లేదు. 

ప్రభుత్వమే మద్యం విధానాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కెసిఆర్ మదిలో మెదులుతూ ఉండడం, ఎక్సయిజ్ అధికారులేమో ఈ విషయంపట్ల అంత సుముఖంగా లేకపోవడం వల్ల నూతన టెండర్లను ఇంకా పిలవలేదు అనేది మాత్రం వాస్తవం. 

ప్రస్తుతం నెలకొన్న ఈ సందిగ్ధత నేపథ్యంలో ప్రస్తుత లైసెన్సులనే ఇంకో మూడు నెలల పాటు పొడిగించాలని ఆలోచనలో ఉంది సర్కార్. ఇదే మద్యం విధానంలో నూతన టెండర్లను పిలవడమే, లేక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నట్టు ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకోవడమా, ఏదో ఒకటి తేలేంతవరకు ప్రస్తుత లైసెన్సులనే మరో మూడు నెలలపాటు పొడగించనున్నారు. 

ఈ మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు చేయబోతున్నారో జగన్ ను అడిగి కెసిఆర్ తెలుసుకున్నారు. మొన్నటి భేటీలో కెసిఆర్ కు జగన్ తమ ప్రభుత్వం ఏ విధంగా ఈ నూతన మద్యం విధానాన్ని నిర్వహించబోతుందో సవివరంగా వివరించాడు. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అప్లికేషన్ ఫీజుల ద్వారా 400 కోట్లు, లైసెన్సుల ద్వారా 1000కోట్ల ఆదాయాన్ని సంవత్సరానికి ఆర్జిస్తోంది. ఒకవేళ ప్రబుజ్త్వమే ఈ మద్యం వ్యాపారాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే ఈ 1400 కోట్లు నష్టపోతుందనేది అధికారుల వాదన. 

అంతేకాకుండా ప్రభుత్వమే పూర్తిగా మద్యం వ్యాపారం నిర్వహిస్తే కొత్త తలనొప్పులు ఎదురవుతాయని అధికారులు వాదిస్తున్నారు. ఒకవేళ మద్యం స్టాకును గనుక ఎవరన్నా దొంగిలిస్తే పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దానికి ఎవరు బాధ్యత వహించాలని కూడా అడుగుతున్నారు. ఇలాంటి సంఘటనలవల్ల తీవ్ర నష్టాలూ వాటిల్లవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. 

అధికారులు లేవనెత్తిన ఈ ప్రశ్నలన్నిటి గురించి కెసిఆర్ జగన్ ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ అన్ని ప్రశ్నలకు జగన్ సావధానంగా, తమ రాష్ట్రంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నామో కెసిఆర్ కు వివరించారట. 

అధికారుల వాదనను వ్యతిరేకిస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం. ప్రస్తుతానికి మద్యం దుకాణాలకు మద్యం సేల్స్ లో 20శాతం మర్గిన్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వమే పూర్తి మద్యం వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటే మరింత ఎక్కువగా లాభాలు వస్తాయని వాదిస్తుంది.

అంతేకాకుండా మద్యంలో జరుగుతున్న కల్తీలకు అడ్డుకట్ట వేయవచ్చు అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మద్యం సిండికేట్లు అనే ఊసే లేకుండా చేయొచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం తెలంతా వరకు ఈ సంవత్సరం చివరాఖరు వరకు పాత లైసెన్సులనే పొడిగించనున్నారని  మాత్రం తెలియవస్తుంది. 


 

click me!