తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతును నొక్కాలని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
పెద్దపల్లి : దేశంలో రైతుబంధును పరిచయం చేసిందే తెలంగాణ సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పెద్దపల్లిలో జరిగిన రోడ్ షోలో చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు మంత్రి కేటీఆర్ పెద్దపల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రైతుబంధునిలిపివేయమంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాల మీద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంటు పోయిందంటూ.. ఎద్దేవా చేశారు.
రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. రాబందులు కావాలా.. అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతును నొక్కాలని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని మండిపడ్డారు. 1956లో కాంగ్రెస్ చేసిన తప్పుకు 50 ఏళ్లు బాధపడ్డాం. తెలంగాణలోని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆ సమయంలో ఆంధ్రాలో కలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కెసిఆర్ చావు నోట్లో తలపెట్టి మరీ తెలంగాణ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.
తర్వాత ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 3000 వేస్తామన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400. ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1200 కు పెంచారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మళ్ళీ టిఆర్ఎస్ గెలిస్తే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తాం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఐదు లక్షల బీమా కల్పిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.