Telangana Elections 2023 : ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నోట ఎన్టీఆర్ నామస్మరణ...

By SumaBala Bukka  |  First Published Nov 20, 2023, 3:20 PM IST

ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టేవాడు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచార ఉపన్యాసంలో సోమవారం నాడు ఓ విచిత్రమైన అంశం వెలుగు చూసింది.  మొదటిసారిగా కెసిఆర్ తన ప్రసంగంలో  టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును.. ఆయన పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పదేపదే గుర్తు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే,  ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు అంటూ ప్రశ్నించారు. 

ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ రూ. రెండుకే  కిలో బియ్యం పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటూ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలో ప్రజలను జైల్లో పెట్టడమా? అంటూ మండిపడ్డారు. 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరో మర్చిపోవద్దని మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని,  పార్టీల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. 

Latest Videos

అధికారం కోసం 2004లో మాతో పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. అభ్యర్థులనే కాదు వాళ్ళ పార్టీ చరిత్రలను కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని తెలిపారు.  కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసమేనన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. కొట్లాడి  తెలంగాణ తెచ్చుకున్నాం.. దాన్ని మరిచిపోవద్దన్నారు. 

click me!