Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ మద్యం, నగదు ప్రవాహాన్ని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఈవో సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రక్రియకు పొంచి ఉన్న ముప్పులను అంచనా వేయడానికి, పరిష్కరించడానికి 'ఎలక్షన్ రిస్క్ అనాలిసిస్ సెల్'ను ఏర్పాటు చేయాలని సీఈవో పిలుపునిచ్చారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ మద్యం, నగదు ప్రవాహాన్ని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఈవో సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రక్రియకు పొంచి ఉన్న ముప్పులను అంచనా వేయడానికి, పరిష్కరించడానికి 'ఎలక్షన్ రిస్క్ అనాలిసిస్ సెల్'ను ఏర్పాటు చేయాలని సీఈవో పిలుపునిచ్చారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశంలో చర్చించారు. ఎన్నికల సమయంలో ర్యాలీలు, బహిరంగ సభలు, ఊరేగింపుల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ కమిటీల ఏర్పాటు వంటి నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడమే లక్ష్యంగా వికాస్ రాజ్ పలు ఆదేశాలు జారీ చేశారు.
మద్యం, మాదకద్రవ్యాలు, డబ్బు, విలువైన వస్తువుల పంపిణీకి సంబంధించిన వివిధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, వ్యయ సున్నితమైన ప్రాంతాలను గుర్తించడానికి జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. హెలిప్యాడ్ల వద్ద భద్రత, నిఘా పెంచాల్సిన అవసరం ఉందనీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వెంబడి సరుకులు, కరెన్సీ అక్రమ రవాణాను నిరోధించేందుకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఈవో నొక్కి చెప్పారు. సున్నితమైన ప్రాంతాలు, సంభావ్య సవాళ్లపై లోతైన అవగాహన కల్పించేందుకు వీలుగా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా సమగ్ర నివేదికలను రూపొందించే బాధ్యతను ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు.
ఎన్నికల ప్రక్రియకు పొంచి ఉన్న ముప్పులను క్రమపద్ధతిలో అంచనా వేయడానికి, పరిష్కరించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాల ప్రధాన కార్యాలయంలో 'ఎలక్షన్ రిస్క్ అనాలిసిస్ సెల్ 'ను ఏర్పాటు చేయాలని సీఈవో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐడీ ఏడీజీ మహేశ్ భగత్, ఎక్సైజ్ శాఖ అడిషనల్ సీపీఈ ఎన్ఏ అజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.