Telangana elections 2023: దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకుంది.. కాంగ్రెస్ పై కేసీఆర్ విమ‌ర్శ‌లు

By Mahesh Rajamoni  |  First Published Nov 24, 2023, 5:07 PM IST

KCR: దళితుల నుంచి భూమిని లాక్కున్నార‌నే కాంగ్రెస్ నేతల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన సీఎం కేసీఆర్.. మూడోసారి గెలిస్తే దళితులకు భూమిపై పూర్తి హక్కు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబంగా మారుతుందని అన్నారు.
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ‌లో దళిత బంధు పథకం అమలు తర్వాత షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సామాజికవర్గం జీవితాల్లో మార్పులు వ‌చ్చాయ‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచలేద‌ని విమ‌ర్శించిన కేసీఆర్ ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందనీ, వారి సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ గులాబీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే వికారాబాద్ (ఎస్సీ) నియోజకవర్గ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని ఒకే విడతలో అమలు చేస్తామన్నారు.

దళితుల నుంచి భూమిని లాక్కున్నార‌నే కాంగ్రెస్ నేతల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన సీఎం కేసీఆర్.. మూడోసారి గెలిస్తే దళితులకు భూమిపై పూర్తి హక్కు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబంగా మారుతుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్ముకుంటే కర్ణాటక ప్రజలకు పట్టిన గతే తెలంగాణ ప్రజలకు పడుతుందని హెచ్చరించిన కేసీఆర్.. కర్ణాటక ప్రభుత్వం రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్ర‌మే ఇస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీకి గులాంలు కాదనీ, కాంగ్రెస్, బీజేపీలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే  వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటల నుంచి మూడు గంటలకు త‌గ్గించ‌డం వంటివి ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

Latest Videos

ప్రస్తుతం ఉన్న 32 లక్షల వ్యవసాయ మోటార్ల స్థానంలో 10 హెచ్ పీ మోటార్లను ఏర్పాటు చేయడానికి రూ.50,000 కోట్లు ఖర్చవుతుందని బీఆర్ఎస్ చీఫ్ అంచనా వేశారు. అలాంటి వారిని గెలిపిస్తే ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. అబద్ధాలు, అర్ధనగ్న సత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు మరోసారి అవాస్తవ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 1969 ఉద్యమంలో 400 మంది మరణించడం, ఏడుగురు యూనివర్శిటీ విద్యార్థుల హత్యలు, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం వంటి వరుస ఘటనలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని కేసీఆర్ ఆరోపించారు. 2004లో పొత్తు తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందనీ, ఇది వందలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిందని ఆయన ఆరోపించారు.

click me!